Monday, February 28, 2011

నేను చేయగలిగింది ఒక్కటే!




ఆకాశాన్ని వంచి.. జాబిలిని దించి.. దానికి గోల్డెన్ ఫేషియల్ చేయించి
నీ నుదుట బొట్టులా పెట్టాలి
ఒక మెరుపుని పట్టుకుని ...కొన్ని చుక్కల్ని ఏరుకొచ్చి...
వాటిని కలిపి నీ పాదాలకు పట్టీలా కట్టాలి

నేను…..
నేను….. నిజానికి ఆకాశాన్ని వంచలేను... జాబిలిని దించలేను..చుక్కల్ని తెంచలేను ..
నేను చేయగలిగింది ఒక్కటే!
అవసరమైతే నాకోసం వీడు ఏదైనా చేసెయ్యగలడు అనేంత నమ్మకం ఇవ్వటం
--శ్రీనివాసమౌళి

Thursday, February 11, 2010

ఆశ నిరాశలు శ్వాసగ అడిగా!

కిరణ్ అన్నయ్య ఇండియా వచ్చినప్పుడు... నేను... కిరణ్(అప్ కమింగ్ పాటల రచయిత).. అవినాష్(వినాయకుడు సినిమా పాటల రచయిత)
కలవటం జరిగింది... ముగ్గురం సినిమాల గురించి...సినిమా పాటల గురించి చర్చించుకుంటుండగా ... మాటల్లో నేను చిన్నగా ఉన్నప్పుడు పెద్దగా హిట్ కాని పాట ఒకటి కిరణ్ వినిపించాడు..వేటూరి గారి రచన అది... దానికి వైరముత్తు గారు తమిళ్ లో పాట వ్రాశారు..ప్రతి లైన్ ...అడిగా! అని పూర్తవుతూ భలే బాగుందనిపించింది పాట...అప్పట్లో నేను బెంగళూరు లో పనిచేసేవాడిని... ఆరోజు తిరుగు ప్రయాణమయ్యా...వోల్వో బస్సులో..ఏమీ తోచని టైం లో ఏవో లైన్స్ గుర్తు వస్తున్నాయి.. సెల్ తీసి రాసేశా... చివరికి మూడు నిమిషాల్లో వ్రాసిన SMS కవిత అయ్యింది.
కొంతమంది స్నేహితులు(ప్రియనేస్తం చంద్రశేఖర్) ఇది నచ్చి కొత్తబంగారులోకం అనేపేరుతో డెస్క్ వద్ద అతికించుకోవటం... గొప్ప అనుభూతిని మిగిల్చింది..ప్రేరణ కిరణ్ అన్నయ్యో! వేటూరి గారో! ముంబై ఉగ్రవాదుల దాడిలో బలైన జవాన్లో ...ఏమో ఎవరో తెలియదు..
నాకు ఈ కవిత చాలా ఇష్టం ....


ఆశ నిరాశలు శ్వాసగ అడిగా!
అనుబంధాలకు అర్ధం అడిగా!
పెనుగండాలను ప్రేరణ అడిగా!
ప్రగతి పధానికి అడుగులనడిగా!
జగతి రధానికి సారధినడిగా!
సత్యం కోరే సంఘం అడిగా!
నిత్యం నిలిచే ప్రేమను అడిగా!
నేనంటే? అని ఈ క్షణాన్ని అడిగా!
మదిని మలచు నిశ్శబ్దం అడిగా!
కసిని పిలుచు కష్టాన్నే అడిగా!
కాలం కలిపే బంధం అడిగా!
మనిషిగ నిలిపే మరణం అడిగా!
తనువు కరిగితే తలపుగ మిగలగ ....
చరిత హృదిని మరుజననం అడిగా!
-- శ్రీనివాసమౌళి

Monday, June 22, 2009

బుడుగు ...బుల్లి అల్లుడి ఖద :)

ఈ మధ్య మా family family కి promotions వచ్చాయ్ :)
మా అక్కకి బాబు పుట్టాడు... చూడటానికి వెళ్ళినప్పుడు వచ్చిన ఆలోచనతో ఒక 'చిన్న బుడుగు' లాంటి కధ రాశా...
నిజానికి బుడుగు లాంటి character ని అనుకరించటం ఒకింత సాహసమే అని తెలుసు...
hope you like it....

బుడుగు

నా పేరు జూనియర్ బుడుగు...నేను పుట్టి రేపటికి మొన్న....
మా అమ్మ పేరు సుష్మ...నాన్న పేరు నాన్న...
మా మామయ్య పేరు మౌళి...మామామయ్యకి సిగ్గెక్కువ ఎవళ్లతోను మాట్టాడడు...
అమ్మాయిలతొనే పోట్టాడుతాడు..వాడు పాటలు రాస్తాడు...
పాటలంటే మాటలే కాని వాటిలిని పాడుతారు
వాడి దగ్గర ఇలాంటివి చాలా ఉన్నై... softwareలు...కొత్త పాటలు...సుత్తి పాటలు ..నత్తి పాటలు(త్యూనులు అంటారులే)
(నేను ఎప్పుడూ ఉంగా ఉంగా అని ఏడ్చినట్టు...పాటంతా త న నా...త న నా అనే పాడుతారు....)
నాకు కూడా పాడటం వచ్చు కాని త న నా అవి రావు...పాడాలనిపిస్తే...పాడినట్టు ఏడుస్తా...కళ్ళుమూచుకుని...

నాకు నవ్వటం కుంచెం వచ్చు...మాట్టాడటం అస్సలు రాదు... యాడవటమే బాగా వచ్చు
అందరూ నేను బాగా ఏడుస్తా అని మెచ్చుకుని ముద్దులు పెట్టుకుంటారు....నాకు అది నచ్చదు...ఏడవటం కాదు వాళ్ళు నన్ను ముద్దులు పెట్టుకోటం
అందుకే ఇంకా గాఠిగా ఏడ్చేస్తాను... అప్పుడు ఇంకా గఠిగా ముద్దులు పెట్టేస్కుని...జో జో బజ్జో...ఒళళళళళా హాయమ్మా ..హాయివారబ్బాయి ఆపదలుగాయి ...చిన్ని తండ్రినిగాయి సీవెంకటేశా!...అని పాడి బెదిరించుతారు
అందుకే మనం ఇలాంటి పాట మొదలవ్వగానే యాడవటం ఆపి నవ్వాలి లేదంటే వాళ్ళు ఆపరు...

నేను ఎందుకు ఏడుస్తానో నాకు తెలీదు....మా అమ్మకి కూడా తెలీదు... మహా మహా మా అమ్మమ్మకి కూడా తెలీదు..
నిజ్జానికి డాక్టరుకి కూడా నేను ఎందుకు ఏడుస్తానో తెలీదు.. కాని ఎవరికి ఏమీ తెలీదని ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది
అసలు పెద్దవాళ్ళకి ఏమీ తెలియదు...నేను ఉచ్చపోచ్చుకొని ఏడిస్తే... పాల పీక తెచ్చి నోట్లో పెట్టేస్తారు...
వద్దన్నా కాని తాగు తాగమ్మ...చీ చీ...పోచ్చి అంటారు..పోనీలే అని మనం కుంచెం తాగటానికి ట్రయ్ చేస్తామా... మొత్తం తాగెయ్యమంటారు..
పాలు వేస్టు అయిపోతయ్ అంటారు... నేనేమైనా పాలు కావాలి అని ఏడ్చానా...పాలు వద్దని ఏడిచానా...ఉచ్చపోచ్చుకుని లంగోటి తడిసిపోయిందని ఏడిచాను..
పాలు పట్టేసినాక నా లంగోటి చెక్ చేసి...అరే వీడు ఇప్పుడే పాలు తాగి అప్పుడే పోసేశాడే అని నవ్వుతారు...
అప్పుడు నాకు నవ్వు వస్తుంది...కాని నేను నవ్వను ఎందుకంటే నాకు నవ్వటం బాఘా రాదు

నాకు యాడవటం బాగా వచ్చు... అమ్మకి బయంపడటం అమ్మమ్మకి జోల పాడటం వచ్చు...
డాక్టరుకి కవర్ చెయ్యటం వచ్చు... మెడికల్ షాపు వాడికి బిల్లు వెయ్యటం వచ్చు...నర్సుకి ఇంజెక్షను చెయ్యటం వచ్చు....
అందుకే నర్సు వచ్చినప్పుడు మనం యాడవకూడదు.. ఎత్తుకుంటే మాత్రం గాఠిగా ఏడ్చెయ్యాలి...

నాకు పాలు పట్టుతారు...అది నాకు నచ్చకపోతే నేను గుక్కపట్టుతాను...నిజ్జం ఏడుపులా నటించుతాను
అప్పుడు అమ్మ భయపడి...అమ్మా! అమ్మా! :( అని అమ్మమ్మని పిలుచుకుంటుంది.....
నేను ఇలా అమ్మకి కుంచెం భయం పెట్టుతాను,,, లేదంటే పెద్దవాళ్ళు మనమీద అజమాయిషీ చేసేస్తారు,,,
చిన్నపిల్లల కింద లోకువ కట్టేసి పాలు పట్టేస్తారు
మా అమ్మ అప్పుడెప్పుడో పుట్టింది..అయినా నేను మా అమ్మకి నిన్నటి వరకు తెలీదు,,,,
నాకైతే పుట్టినప్పటినుంచి మా అమ్మ తెల్సు...

నాకు AC అన్నా లంగోటి అన్నా... చాలా ఇష్టం రెండూ చల్లగా ఉంటయ్....
ఇంకా మా మామయ్య కొనుక్కొచ్చిన జుబ్బా వేచుకుని కళ్ళూ మూచుకుని దోమతెర అంబ్రిల్లా లో పడుకోటం ఇంకా ఇష్టం

మా నాన్నకి సెలవలు లేవంట...మా మామయ్యకి తాతయ్యకి(నాన్న తాతకి...అమ్మ తాతకి) కూడా లేవంట...
నా దగ్గర మాత్రం ఉన్నయ్యా ఏంటి నాకు అసలు సెలవంటే ఏంటో కూడా తెలీదు ఇంక నా దగ్గర ఎలా ఉంటయ్
నా దగ్గర ఉంటే కుంచెం ఇచ్చేవాడినే ఎందుకంటే నేను మంచివాడిని...ఛాలా మంచి వాడిని...పండు వాడిని..

నాకు అమ్మ పోలికా?..నాన్న పోలికా?... ఎవరిపోలిక అని అంటూ ఉంటారు కాని నాకు అస్సలు మా తాత పోలిక
నిన్నే ఈ విషయం కనిపెట్టా ఎందుకంటే మా తాతకి కూడా నా లాగే పళ్ళు లేవ్

--శ్రీనివాసమౌళి

చెప్పటం మర్చిపోయా! నాకు "హి" అనే అక్షరంతో పేరు పెట్టాలి... మీకు ఏమైనా పేర్లు అనిపిస్తే బుడుగుకి పేరు అని సబ్జెక్టు పెట్టి మా మామయ్యకి నాలుగో ఫదో పేర్లు కామెంట్లో చెప్పండి

Saturday, January 12, 2008

జ్ఞానోదయం..



దోమలు చెవిలోనే ఎందుకు అరుస్తాయో తెలుసా??

ఎందుకబ్బా....ఎందుకబ్బా.....ఎందుకు...ఎందుకు...ఎందుకు....
ఎందుకు చెప్మా....
జ్ఞానోదయం..జ్ఞానోదయం..

అవి చెవి దగ్గరకి వచ్చి ఎమీ అరవవు..... చెవికి దగ్గరగా వచ్చినప్పుడు మనకి వాటి అరుపు వినపడుతుంది అంతే!..

ఇట్లు,
నేను.

Sunday, December 23, 2007

'స్నేహ'లేఖ.......




తేనె వానలో తడిసిపోతున్నట్టుంటుంది...గతంలోకి తొంగి చూస్తుంటే..
వీణతీగనై మురిసిపోతున్నట్టుంది..స్నేహం నన్ను మీటుతుంటే
స్నేహం అంటే ఇంత తియ్యగా ఉంటుందా!...అనిపిస్తుంది
అమ్మో ఏంటి కళ్ళు చెమరుస్తాయా.. ఇప్పుడు
ఈ స్నేహపు పేజీలు వెనక్కితిప్పి చూస్తూఉంటే..
ఏదో అందమైన అనుభూతి ...
మనసు ..చక్కిలిగింతలు పెట్టినప్పుడు నవ్వే చంటి పాపలా
స్వఛ్ఛంగా నవ్వుతుంది
నవ్వలేక పరవశంలో ఉక్కిరి బిక్కిరి అవుతుంది
అంతలోనే ఈపరిచయం లేకుంటే అన్నతలపు
ఆ ఊహే చాలా కర్కశంగా ఉంటుంది...
ఆ భయంలోంచే అసలు ఈ స్నేహం సత్యమా..స్వప్నమా అనే పిచ్చి అనుమానం
ఈ నిశ్శబ్దాన్ని ఒంటరి తనాన్ని తరిమేస్తూ....
మళ్ళీ ఆ వీణ సరికొత్తరాగంలో ధ్వనిస్తుంది....
భౌ అంటు మళ్ళీ నా చుట్టూ చేరిపోతుంది....

ఇందుకే దేవుడికి ఒక వరం ఇయ్యాలనిపిస్తుంది...
అప్పుడు మనసు దేవుడికి చెప్తుంది...
తీసుకో నాదగ్గరున్నది ఏదైనా ....ఈ స్నేహం తప్ప...
ఇది వరం ఇయ్యటమో దీవెన అడగటమో మాత్రం తనకు తెలియదు...
(శ్రీనివాసమౌళి)
--------------------------------------------------
ఇది నా స్నేహితురాలైన షర్మి అనే అమ్మయికోసం రాసిన స్నేహలేఖ ...అదేనండి ప్రేమించుకునే వాళ్ళు రాస్తే ప్రేమలేఖ అంటారుగా అలానే స్నేహం చేసినవాళ్ళకు రాసేది స్నేహలేఖ!
ఇది కవిత కాదు...కధ కాదు....మదిలో భావాల సమాహారం అంతే.....
మా జీవితకాలపు స్నేహానికి ఇప్పటికి సంవత్సరం.......
అందుకే ఈ చిరు కానుక .....

Saturday, December 1, 2007

ఓ పులిరాజా చెప్పిన ఆత్మకధ..

ఇవ్వాళ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం....
ఈవిషయం గుర్తుకు రాగానే ఒక విషయం జ్ఞాపకం వస్తుంది ...అదే ఆరోజు పులిరాజా చెప్పిన ఆత్మకధ

ఓ రోజు అలా నడుస్తూ వెళ్తున్నా పంజాగుట్టా దారిలో.....రోడ్డు పక్కన ఉన్న హోర్డింగ్... పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా అని.....
అంతలోనే ఆ నిసీధి నిండిన దారిలో ప్రత్యక్షం అయ్యాడు ...పులిరాజా
అతడిని నేను బాగా ఎరుగుదును కానీ ఇన్నాళ్ళు ఆ పులిరాజా ఇతనే అని తెలియలేదు....దిగాలుగా ఉన్న అతను గుండె గుభేలుమనేలా చెప్పిన కధ...ఇది కధ కాదు తన అత్మ వ్యధ.

ఓ పులిరాజా చెప్పిన ఆత్మకధ..


వేయిజన్మల తపము నేటితో ఫలియించి
పంపాడు ఆబ్రహ్మ సుందరాంగిని మలచి
వయ్యారి సుకుమారి మదిలో నన్నే తలచి,
గారంగ పిలిచింది వలపుతో నను వలచి
వయసులో అందాలు వెన్నెల్లో పరచి
రుచిచూడ రమ్మంది విరహాన్ని మరచి

అధరాల మధియించి ...అందాలు స్పృసియించి..
ఆడింది నాతనువు హృదయ తాపము రెచ్చి
మధురంగ మొదలైన ఈ కొత్త పిచ్చి
నా అణువణువు తొలిచింది నన్ను ఏమార్చి
సమిధలా మారింది నాతనువు తలవంచి
ఆహుతైపోయింది ఆఖరికి విలపించి...
ఆహుతైపోయింది ......ఆఖరికి...విలపించి...


అయ్యబాబొయ్ ఆత్మలతో మాట్టాడింది చాలు ... భయంపోయేలా పరమాత్మని ధ్యానించుకోవాలి... నేను జంప్...మళ్ళీ కలుస్తా ....
ఇట్లు,
నేను (అంటే శ్రీనివాసమౌళి)
ఛీ ఛీ, అంటే శ్రీనివాసమౌళి కాదు ఉత్త శ్రీనివాసమౌళి నే..
ఉత్త శ్రీనివాసమౌళి ని కూడా కాదు... శ్రీనివాసమౌళి.

Thursday, November 1, 2007

ప్రేమాభిషేకం ..(ద షవర్ ఆఫ్ లవ్)

ఇక్కడ నేను అందరికీ తెలిసిన కధనే నాకు తోచిన విధంగా వ్యక్తం చేశాను....
చూడండి ఒకసారి ....మీ అభిప్రాయాలకు welcome........

ఈ కధకి మూలం పంచదార చిలక అనే సినిమాలో చెప్పిన కధ. పాయింట్ తీస్కుని కధనాన్ని ..పాత్రల రూపును చిత్రీకరించాను.ఆ సినిమా లో ఈ కధను రాసిన వారికి ధన్యవాదాలు.

ప్రేమాభిషేకం ...(ద షవర్ ఆఫ్ లవ్)

అదో అందమైన సూర్యోదయం అప్పుడే ఉదయిస్తున్న సూర్యుని వెచ్చని కిరణం స్పర్సతో పుడమి పులకరిస్తోంది తన చుట్టూ ఉన్నవారిని మనసారా పలకరిస్తోంది...ప్రకృతి పైట వేసినట్టు ఆ ప్రాంతమంతా పచ్చికతో,పచ్చని చెట్లతో కళకళలాడుతోంది అప్పటివరకు కురుస్తున్న మంచు కరిగి ఆ పచ్చికపై నీటి బిందువులా చేరి సూర్య కిరణాల తోడుతో నింగినుంచి జారే తారలా మెరుస్తూ మనస్సు తలుపును తడుతోంది.భానుని వెచ్చని స్పర్సతో పూలు వికసిస్తున్నాయి.ఆ ప్రాంతమంతా పక్షుల కిలకిలలు,సెలయేటి గలగలలు,పూల ఘుమఘుమలతో పరువాన్ని పరుగెత్తిస్తోంది.

ఆ అందమైన లోకం లోకి ,భువినున్న స్వర్గంలోకి తొలిసారి వచ్చింది ఓ తెల్లని పావురం. ఆ నందనవనం లోకి అడుగిడుతూ తనను తాను మరచింది మైమరచింది.ఆడుతూ పాడుతూ తోటంతా తిరిగింది.తిరుగుతూ తిరుగుతూ...హఠాత్తుగా ఆగింది ఓ గులాబీని చూసి అది అందానికే అద్దం లాంటి,అర్ధం లాంటి ఓ తెల్ల గులాబీ.అది అరాధనగా చూస్తోంది ఆ పావురం కేసి.తొలి చూపులొనే తన మనస్సును ఆ గులాబీకి అర్పించింది.తన ప్రేమ సందేసాన్ని తన ప్రియురాలికి అర్పించింది ...తను కాదనదన్న నమ్మకంతో ...
ఆ ప్రియురాలిని ఒప్పించటానికి ఆడింది పాడింది,తనను తరచి తరచి అడిగింది.అప్పుడు.....

ఆ అందమైన గులాబీ అతి విచిత్రమైన కోరిక కోరింది.తన అందాన్ని అందలంలో ఉంచమనలేదు తన తనువును తొలకరితో తడపమనలేదు తనను ఒక ఆడంబరమైన ఎర్ర గులాబీ గా మార్చమని అడిగింది.తన తనువును మనస్సును అర్పించి జీవచ్చవమైన ఆ గువ్వ తన జీవం పోయినా ఆ గులాబీని పొందాలనుకుంది అలా,ఓ అసాధ్యానికి శ్రీకారం చుట్టింది.

సూర్యుడు ప్రజ్వలిస్తుండగా వడగాలులు సెగలు కక్కుతుండగా కక్కుతుండగా.....

ఆ అందమైన గులాబీ మొక్క యొక్క ముల్లును తన గుండెకు గుచ్చుకొని
పైకెగిరింది. ఆ గులాబీ పై ఒక్కొక్క రక్తపు బొట్టునూ జార్చింది.
అలా ఆ తెల్ల గులాబీ ఎర్రగా మారింది.సూర్యుడు మసకపడిపోతుండగా మరో సూర్యునివలే ప్రకాసించింది.తన రంగును చూసుకుని గర్వించింది ,ఆనందించింది.తన పంతం నెరవేరినందుకు వికృతంగా నవ్వింది... తనను చూసుకుని మురిసిపోయింది.

తన కోరిక తీర్చిన పావురానికి ప్రేమ కానుక అందించాలి అనుకుంది.కనులు ఎత్తి చూసింది చిరునవ్వుతో ఎదురుగా పావురం ఉంటుంది అన్న తలంపుతో.కానీ పావురం కనపడలేదు,ఆకాశం కేసి చూసింది పావురం కోసం ఐనా అది కనబడలేదు...
సెలయేటి హొరు మారలేదు కానీ తీరు మారింది..చుట్టూ చూసింది ఆ గులాబీ తన ప్రియుని కోసం ,తనతోపాటు ఆ పచ్చిక కూడా ఎర్రగా మారింది అని గ్రహించింది..మరలా చుట్టూ కలియచూసింది.

అప్పుడు ఆ ఎర్రని పచ్చికలో , ఆ గులాబీ మొక్క పాదాల వద్ద కొన ప్రాణంతో ఉన్న ఆ పావురం కనిపించింది , అది గులాబీ కేసి చూస్తోంది చిరునవ్వుతో. ఆ గులాబీ తనకు కనిపించినది చూసి విలవిలలాడింది , విలపించింది.తన ఎర్రరంగును కన్నీళ్ళతో కడుక్కొని తెల్లగా మారింది ....తన మూర్ఖత్వాన్ని నిందించుకుంటూ కుమిలిపోతూ కూర్చుంది .... ఆ అమావాస్య రాత్రిని అసహనంతో,అసహాయంగా గడిపింది.


మరుసటి రోజు సూర్యుడు తనకు కనిపించిన దృశ్యం చూసి నిప్పులు చెరిగాడు.ఆ గ్రీష్మ తాపానికి పచ్చిక ఎండిపోయింది.నిశ్శబ్దం నృత్యం చేసింది.ప్రకృతి తన కన్నీళ్ళతో ఆ ప్రాంతాన్ని సుధ్ధి చేసింది.ఆ పావురాన్ని దాని కౌగిలిలో ఉన్న వాడిన గులాబీని ఆఖరుసారి తనివితీరా స్పృసించింది .......
మూగగా రోదించింది ...........

(శ్రీనివాసమౌళి )