Thursday, November 1, 2007

ప్రేమాభిషేకం ..(ద షవర్ ఆఫ్ లవ్)

ఇక్కడ నేను అందరికీ తెలిసిన కధనే నాకు తోచిన విధంగా వ్యక్తం చేశాను....
చూడండి ఒకసారి ....మీ అభిప్రాయాలకు welcome........

ఈ కధకి మూలం పంచదార చిలక అనే సినిమాలో చెప్పిన కధ. పాయింట్ తీస్కుని కధనాన్ని ..పాత్రల రూపును చిత్రీకరించాను.ఆ సినిమా లో ఈ కధను రాసిన వారికి ధన్యవాదాలు.

ప్రేమాభిషేకం ...(ద షవర్ ఆఫ్ లవ్)

అదో అందమైన సూర్యోదయం అప్పుడే ఉదయిస్తున్న సూర్యుని వెచ్చని కిరణం స్పర్సతో పుడమి పులకరిస్తోంది తన చుట్టూ ఉన్నవారిని మనసారా పలకరిస్తోంది...ప్రకృతి పైట వేసినట్టు ఆ ప్రాంతమంతా పచ్చికతో,పచ్చని చెట్లతో కళకళలాడుతోంది అప్పటివరకు కురుస్తున్న మంచు కరిగి ఆ పచ్చికపై నీటి బిందువులా చేరి సూర్య కిరణాల తోడుతో నింగినుంచి జారే తారలా మెరుస్తూ మనస్సు తలుపును తడుతోంది.భానుని వెచ్చని స్పర్సతో పూలు వికసిస్తున్నాయి.ఆ ప్రాంతమంతా పక్షుల కిలకిలలు,సెలయేటి గలగలలు,పూల ఘుమఘుమలతో పరువాన్ని పరుగెత్తిస్తోంది.

ఆ అందమైన లోకం లోకి ,భువినున్న స్వర్గంలోకి తొలిసారి వచ్చింది ఓ తెల్లని పావురం. ఆ నందనవనం లోకి అడుగిడుతూ తనను తాను మరచింది మైమరచింది.ఆడుతూ పాడుతూ తోటంతా తిరిగింది.తిరుగుతూ తిరుగుతూ...హఠాత్తుగా ఆగింది ఓ గులాబీని చూసి అది అందానికే అద్దం లాంటి,అర్ధం లాంటి ఓ తెల్ల గులాబీ.అది అరాధనగా చూస్తోంది ఆ పావురం కేసి.తొలి చూపులొనే తన మనస్సును ఆ గులాబీకి అర్పించింది.తన ప్రేమ సందేసాన్ని తన ప్రియురాలికి అర్పించింది ...తను కాదనదన్న నమ్మకంతో ...
ఆ ప్రియురాలిని ఒప్పించటానికి ఆడింది పాడింది,తనను తరచి తరచి అడిగింది.అప్పుడు.....

ఆ అందమైన గులాబీ అతి విచిత్రమైన కోరిక కోరింది.తన అందాన్ని అందలంలో ఉంచమనలేదు తన తనువును తొలకరితో తడపమనలేదు తనను ఒక ఆడంబరమైన ఎర్ర గులాబీ గా మార్చమని అడిగింది.తన తనువును మనస్సును అర్పించి జీవచ్చవమైన ఆ గువ్వ తన జీవం పోయినా ఆ గులాబీని పొందాలనుకుంది అలా,ఓ అసాధ్యానికి శ్రీకారం చుట్టింది.

సూర్యుడు ప్రజ్వలిస్తుండగా వడగాలులు సెగలు కక్కుతుండగా కక్కుతుండగా.....

ఆ అందమైన గులాబీ మొక్క యొక్క ముల్లును తన గుండెకు గుచ్చుకొని
పైకెగిరింది. ఆ గులాబీ పై ఒక్కొక్క రక్తపు బొట్టునూ జార్చింది.
అలా ఆ తెల్ల గులాబీ ఎర్రగా మారింది.సూర్యుడు మసకపడిపోతుండగా మరో సూర్యునివలే ప్రకాసించింది.తన రంగును చూసుకుని గర్వించింది ,ఆనందించింది.తన పంతం నెరవేరినందుకు వికృతంగా నవ్వింది... తనను చూసుకుని మురిసిపోయింది.

తన కోరిక తీర్చిన పావురానికి ప్రేమ కానుక అందించాలి అనుకుంది.కనులు ఎత్తి చూసింది చిరునవ్వుతో ఎదురుగా పావురం ఉంటుంది అన్న తలంపుతో.కానీ పావురం కనపడలేదు,ఆకాశం కేసి చూసింది పావురం కోసం ఐనా అది కనబడలేదు...
సెలయేటి హొరు మారలేదు కానీ తీరు మారింది..చుట్టూ చూసింది ఆ గులాబీ తన ప్రియుని కోసం ,తనతోపాటు ఆ పచ్చిక కూడా ఎర్రగా మారింది అని గ్రహించింది..మరలా చుట్టూ కలియచూసింది.

అప్పుడు ఆ ఎర్రని పచ్చికలో , ఆ గులాబీ మొక్క పాదాల వద్ద కొన ప్రాణంతో ఉన్న ఆ పావురం కనిపించింది , అది గులాబీ కేసి చూస్తోంది చిరునవ్వుతో. ఆ గులాబీ తనకు కనిపించినది చూసి విలవిలలాడింది , విలపించింది.తన ఎర్రరంగును కన్నీళ్ళతో కడుక్కొని తెల్లగా మారింది ....తన మూర్ఖత్వాన్ని నిందించుకుంటూ కుమిలిపోతూ కూర్చుంది .... ఆ అమావాస్య రాత్రిని అసహనంతో,అసహాయంగా గడిపింది.


మరుసటి రోజు సూర్యుడు తనకు కనిపించిన దృశ్యం చూసి నిప్పులు చెరిగాడు.ఆ గ్రీష్మ తాపానికి పచ్చిక ఎండిపోయింది.నిశ్శబ్దం నృత్యం చేసింది.ప్రకృతి తన కన్నీళ్ళతో ఆ ప్రాంతాన్ని సుధ్ధి చేసింది.ఆ పావురాన్ని దాని కౌగిలిలో ఉన్న వాడిన గులాబీని ఆఖరుసారి తనివితీరా స్పృసించింది .......
మూగగా రోదించింది ...........

(శ్రీనివాసమౌళి )