Monday, July 27, 2015

శ్రీమంతుడు ... పర్పస్ ఉన్న పాటలు ( Lyrics - Review)

శ్రీమంతుడు


మహేష్ బాబు సినిమా అంటేనే జనాల్లో అంచనాలు,ఆసక్తిఉంటాయి, మిర్చిలాంటి విభిన్నమైన కథతో బ్లాక్బస్టర్ తీసిన కొరటాల శివ దర్శకత్వం ,తన పాటలతో ఉర్రూతలూగించే దేవీశ్రీప్రసాద్ సంగీతం. ఇవన్నీ ఈసినిమాపై ఆసక్తిని అమాంతం పెంచేశాయి.
ఇటీవలే విడుదలైన ఈ సినిమా పాటలు ఈ అంచనాల్ని నిలబెడుతూ చార్ట్బస్టర్ లు గా నిలిచి ఈ ఆడియోని పెద్ద సక్సెస్ చేశాయి
దేవీశ్రీ ప్రసాద్ సంగీతంలో వరసగా హిట్ పాటలు రాస్తూ దూసుకుపోవటమే కాకుండా,
మహేష్ బాబు నటించిన ఖలేజా సినిమాలో 'సదాశివ సన్యాసి ' పాటకు గీత రచయితగా ఫిల్మ్ ఫేర్ అందుకున్న రామజోగయ్య శాస్త్రి ఈ చలన చిత్రం లోని పాటలన్నిటికీ అద్భుతమైన, సందర్భోచితమైన సాహిత్యాన్ని అందించారు.
పాటలు వింటుంటే ఇటువంటి కథను ఎంచుకున్న దర్శకుడిని ప్రశంసించకుండా ఉండలేం అనిపిస్తుంది. దేవీశ్రీ ప్రశాద్, రామజోగయ్య విజృంభించి చేశారు పాటలని.

పాటలకు తమదైన ఆత్మ ఉంది, సాహిత్యం మనసుని హత్తుకుని ఆత్మను స్పృసిస్తుంది. 

శ్రీమంతుడు ... పర్పస్ ఉన్న పాటలు 

  1. హే రాములోడు వచ్చినాడురో: ఈ ఆల్బంలో మొదటిగా వచ్చే పాట 'రాములోడు వచ్చినాడురో' ఒక వినూత్నమైన ప్రయోగాత్మకమైన పాట.రామాయణంలోని కథను మొత్తాన్ని ఒక్క ఫోక్ పాటలో చెప్పగలగటం అవలీలగా చేసేశారు. ఈ పాటలో రామాయణ సారాన్ని జీవితానికి అన్వయిస్తూనే మధ్యలోనే                                                             "జీవుడల్లే పుట్టినాడురో దాంతస్సదియ్య దేవుడల్లే ఎదిగినాడురో"                                                        "చెడుతలపుకి చావుదెబ్బ తప్పదంటు చెప్పినాడురో"                                                                            "తనకథనే పూసగుచ్చి మనకు నీతి నేర్పినాడురో" అని వ్రాయటంలో రచయిత నేర్పు కనపడుతుంది.
    ఈ పాటలో కోరస్ లో 'మరామరామరామరామా' అని రామాయణంలోని కథను స్పురింపచేసే పదం చక్కగా ఇమిడింది.

2. జతకలిసే: "జగములు రెండు జతకలిసే"  అని మొదలయ్యే రెండవ పాట ,
                 రెగులర్ గా స్లో డ్యూయట్ అనగానే హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ పాట అన్నట్టు కాకుండా ,ఒక స్వఛ్ఛమైన అనుబంధం గురించి, దాని తాలూకు మాధుర్యం గురించి విభిన్నంగా  వివరించిన పాట ఇది. కట్ చేస్తే వచ్చే ప్రేమపాటలా కాకుండా ఒక అనుబంధాన్ని తద్వారా హీరో హీరోయిన్ కారెక్టర్స్ ఎస్టాబ్లిష్ చేయటానికి వాడుకోవటం వల్లే అసలు ఈ పాటలో కొత్తదనం                   వచ్చింది అనిపిస్తుంది.ఈ పాట కు సంగీతం సాహిత్యం అల్లుకుపోయి ఒక మంచి పాట విన్న అనుభూతి కలిగిస్తాయి.

    "ఏ కన్నూ ఎపుడూ చదవని పుస్తకమై వీరు, చదివేస్తున్నారు ఆనందంగా ఒకరిని ఇంకొకరు
      ఈ లైన్ వినగానే ఆకట్టుకుంటుంది, విన్నాక మనసులోనే తిరుగాడుతూ ఉంటుంది.
    ఇలాంటి జంటని ఎవరూ చూసిఉండరు, ఆడ మగ అని బేధం మనసులోని ఇంకా రాని పసివాళ్ళ అంత స్వచ్చంగా ఉన్నారు 
     అని చెప్పటం చాలా బాగుంది. 

    "నలుపు జాడ నలుసైనా అంటుకోని హ్రుదయాలు/తలపులోతున ఆడమగలని గురుతులేని పసివాళ్ళు" అంటూ ఏ కల్మషం 
     లేనీ స్వచ్చమైన Feeling అనే భావాన్ని చిన్న పదాల్లో  చాలా అందం గా చెప్పటం జరిగింది.
      అలానే "బహుశా బ్రహ్మ పొరపాటు ఏమో ఒకరే ఇద్దరు అయ్యారు", "ఇపుడే కలిసి అప్పుడే వీరు ఎపుడో కలిసిన వారయ్యారు
      ఇవి కూడా ముచ్చటగా ఉన్నాయి

3. చారుశీల: మూడో పాటగా "చారుశీల" బీట్ ప్రధానంగా సాగే ప్రేమ పాటగా వస్తుంది. ఇలాంటి పాటల్లో రామజోగయ్య ది 
                  అందెవేసిన చెయ్యి.  
           "నీ స్మైలే లవ్ సింబలా ","కాముడు రాసిన గ్లామర్ డిక్ష్ నరీ" , "వైల్డ్ ఫైర్ పై వెన్నపుస వయసా" ఇవి కొన్ని చమక్కులు.
           ఈపాట మొత్తానికి "నా మునివేళ్ళకు కన్నులు మొలిచెనే నీసిరి సొగసును తాకితే" అన్న ఎక్స్ప్రెషన్ చాలా బాగుంది.

4. శ్రీమంతుడా: "సాయం, సమాజమే నీగేయం నిరంతరం కోరే ప్రపంచ సౌఖ్యం నీకు కాక ఎవరికి సాధ్యం!"

       ఈ సినిమా ఆత్మని ప్రతిబింబిస్తున్నట్టు అనిపిస్తూ ఆత్మని తాకే పాట "శ్రీమంతుడా". ఈ పాటను రామజోగయ్య  ఫిలాసఫీ , 
        ఆశావహదృక్పధం కలగలిపి ఎంతో అద్భుతం గా రాశారు. రాస్తూ కూడా కవి ఎంతో తన్మయత్వం పొంది ఉంటాడనిపిస్తుంది 
        పాటంతా పరుచుకున్న ఉదాత్తమైన భావాలు, ప్రయోగాలు, అలంకారాలు చూస్తే.   
        సరళంగా ఉన్న రుద్రవీణ పాటను తలపిస్తుంది ఈ పాటలోని "మనిషితనం".

             "లోకం చీకట్లు చీల్చే ధ్యేయం నీ ఇంధనం ప్రేమై వర్షించనీ నీ ప్రాణం"
            "రుణము తీర్చే తరుణమిది  కిరణమై పదపదరా" లాంటి భావాలు పాటంతా కనిపిస్తాయి 
             విశ్వమంతటికీ పేరుపేరునా ప్రేమ పంచగల పసితనమా
            లేనిదేదో పనిలేనిదేదో విడమరచి చూడగల ఋషి గుణమా
             లాంటి భావాలు, భావ వ్యక్తీకరణ అత్యద్భుతంగా ఉన్నాయి.

           పాట విన్నాక మనసు మనతో పిలుపు వినరా అనకమానదు
            మనసు వెతికే మార్గమిదిరా మంచికై పదపదరా! పిలుపు వినరా!

5. జాగో జాగో: ఇది కథానాయకుడి కారెక్టరైజేషన్ వ్యక్తపరుస్తూ వచ్చే ఫాస్ట్ బీట్ పాట. ఇందులో కూడా శ్రీమంతుడి ఉదాత్తమైన 
                    భావాలు బీట్ లో చక్కగా ఒదిగిపోయాయి.
            "వేల వేల వేల సైన్యం అయ్యి ఇవాళ దూసుకెళ్ళమంది నాలో కల" , నట్టనడి పొద్దు సూరీడులా నవ్వటం
             సంతోషాల జెండా ఎగరేశా లాంటి భావలు బాగున్నై.

          "వెతికా నన్ను నేను దొరికా నాకు నేను, నాలో నేను ఎన్నోవేల వేళ్ళ మైళ్ళు తిరిగి
           పంచేస్తాను నన్ను పరిచేస్తాను నన్ను ఎనిమిది దిక్కులన్నీ పొంగిపోయే ప్రేమై వెలిగి"

         "స్వార్ధంలేని చెట్టు బదులేకోరనంటూ పూలుపళ్ళూ నీకూ నాకూ ఎన్నో పంచుతుందే
          ఏమీపట్టనట్టు బంధం తెంచుకుంటూ మనిషే సాటిమనిషిని చూడకుంటే అర్థం లేదే"
        "విలా విలా అల్లాడిందే ప్రాణం  చేతైన మంచే చెయ్యకుంటే,ఇవ్వాలనిపించదా ఇస్తూ ఉంటే .. జాగో జాగో  "
        లాంటి భావాలతో పాటంతా గొప్పగా ఉంది.

         ఇతరులకి సాయపడటం , చేతనైనంతలో మంచి చేయటం అనే mission ఉన్నకథా నాయకుడు పాడే మనిషితనం 
         నిండిన పాట.అటు సినిమాలో ఇమిడి , కథను ముందుకు నడుపుతూనే, సినిమాకు సంబంధం లేకుండా చూస్తే 
          సాహిత్యం గా కూడా నిలబడే పాటలు రాయటంలో కవి సఫలం అయ్యారనిపిస్తాయి ఈ పాటలు.

6. దిమ్మతిరిగే: రెగులర్ మాస్ పాట దిమ్మతిరిగే పాట. లిరిక్స్ ట్యూన్ కి తగ్గట్టుగా ఉన్నాయి.
                   దిమ్మతిరిగే దిమ్మతిరిగే "కమ్మ కమ్మగా దిమ్మ తిరిగే" అనటం కొత్తగా ఉంది. అలానే
                   పులిగోరు , చేపకూర అంటూ నేటివిటీ కి తగ్గట్టు ఉంటూ
                  "నువ్వే కాని కలకండైతే నేనో చిట్టి చీమై పుడతా!" లాంటి చిలిపి ఎక్స్ప్రెషన్స్ తో మంచి ఊపు ఉన్న పాట ఇది

కథకు దగ్గరగా ఉన్న పాటలు తెలుగులో రావటం తక్కువే.కథలో మిళితమై కథను ముందుకు నడిపే పాటల్లా అనిపిస్తాయి శ్రీమంతుడు సినిమాలోని పాటలు.
సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్, సాహిత్యం అందించిన రామజోగయ్య శాస్త్రి , దర్శకులు కొరటాల శివల టీం వర్క్ కనిపిస్తుంది
మొత్తంగా ఈ శ్రీమంతుడు ఆల్బం వింటే మంచి పాటలు విన్న సంతృప్తి కలుగుతుంది, సినిమా పై ఆసక్తి పెరుగుతుంది.
మనసుపొరల్లో ఎక్కడో ఉన్న మనిషితనం అనే విత్తనం చిగురువేస్తుంది.

No comments: