Friday, July 15, 2016

అన్నీ పంజరాలే!

అన్నీ పంజరాలు , నువ్వే నీ చుట్టూ కట్టుకున్నవి
నిన్ను ప్రతిబింబించని అద్దాల్లో ఇమిడిపోయావు

పచ్చికపై ఎప్పుడు నడిచావో
ఉషోదయాలెప్పుడు చూశావో
అకాశాన్ని అబ్బురపడుతూ గమనిస్తూ
రాలిపడే తారలను కనుగొన్నావో లేదో
ఒక నిర్మలమైన రాత్రి
నీలోకి నువ్వు తొంగి చూసుకున్నావో లేదో

అన్నీ పంజరాలే , నీకు నువ్వు కట్టుకున్నవే
అక్కడే అందులోనే
స్వేఛ్ఛగా విహరిస్తున్నావు
ప్రకృతి నీవు వేరు కాదనీ మమేకమవ్వమనీ
ఆహ్వానించేదెవ్వరు ?

నిన్ను బంధించినదెవరు? నీ మోహం తప్ప
నిన్ను విడిపించేదెవ్వరు , నువ్వు తప్ప

--శ్రీనివాసమౌళి

Sunday, December 20, 2015


బాజీరావు మస్తానీ (పాటల విశ్లేషణ)



జాబిలి, జావళి, అందెలు, మరుడు, సాంత్వన, ఉగాది, నిశీధి,
జయభేరి, కుంకుమ, గంధము, కలికి అప్సర,తెమ్మెర, దొంతర, మహారాణి,
బహుమానం, వెర్రి ప్రేమ, స్పర్శ, పాలపుంత , సరాగం, అల్లరి, పచ్చి వెన్నెల, కెందామర
ఇలాంటి అచ్చతెలుగుపదాలకు తెలుగుపాటలు ఈమధ్యనోచుకున్నది తక్కువే.
సవ్యసాచి సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన బాజీరావ్ మస్తానీ సినిమా పాటలు గొప్పగా ఉన్నాయి. ఇలాంటి ప్రతిష్టాత్మకమైన దృశ్యకావ్యానికి పాటల రచన అవకాశం అందిపుచ్చుకున్న రామజోగయ్య శాస్త్రి కూడా అద్భుతమైన సాహిత్యం అందిచారు.
నిన్నటి నిశీధికి ఉదయమాయెను సాంత్వన
చిగురయే ఉగాదిగా వెలిగెనే నిరీక్షణ
లాంటి పంక్తులను గమనిస్తే కేవలం హిందీ పాటలకు తెలుగు అనువాదం కాకుండా ఒక అడుగు ముందుకువేసి తెలుగుతనం అద్ది రచయిత తనబాధ్యత నెరవేర్చటంలో సఫలీపృతులయ్యారు అనుకోవచ్చు.
ఇలాంటి పాటలు రావటం అరుదు.
ఇలాంటి అచ్చతెలుగు సినిమా పాటల్లోకి రావటం, భాషతో పాటూ భావమూ అంతే చక్కగాను చిక్కగాను ఉండటం ఈపాటల సాహిత్యం చాలా అద్భుతం గా కుదిరిందని చెప్పుకోవచ్చు , సంజయ్ లీలాభన్సాలీ సంగీతం కూడా అణువణువునా ఆత్మ నింపుకుని జీవంతో తొణికిసలాడింది. ప్రతిపాటలోనూ సంగీత సాహిత్యాలు పొందికగా అమరాయి.
పాటలకు కూర్చిన ఆర్కెస్ట్రైజేషన్ బాగుంది అని చెప్పి ఆపేయలేం, ట్రెడిషనల్ దేశీయ వాయిద్యాలు విరివిగా ఉపయోగంచినా, ఎంతో కొత్తగాను ఏదో మాయగాను ఉంది.ఈ ఆల్బం లోని ప్రతి పాటలోనూ ఫీల్ చక్కగా ఎలివేట్ అయ్యింది.
గాయనీ గాయకుల ఎపిక కూడా అద్భుతమే, ఒక్కొక్కళ్ళు పాటలకి ప్రాణం పోశారు, వాళ్ళ శక్తి కొలదీ తెలుగుదనం నింపారు. శ్రేయాగోషల్ ముఖ్యంగా. వింటున్న కొద్దీ నచ్చే పాటలు ఇవి.
ముఖ్యంగా చాలా వరకు తెలుగు పాటల్లా కాకుండా ఈసినిమా లో పాటలు కథను నేరేట్ చేస్తూ ఉన్నాయి. పాత్రల స్వభావం తాలూకూ పదాలను, భావాలను ఉపయోగించటం చూడచ్చు.
చక్కని అభిరుచి ఉన్నప్పుడు ఇలాంటి మంచి పాటలు వస్తుంటాయి.
ఇలాంటి అరుదైన సినిమాకి సింగిల్ కార్డ్ అవకాశం రావటం రామజోగయ్య గారి అదృష్టం ఐతే.. ఆ పాటలకి ఆయన అందించిన సాహిత్యం ఆ అదృష్టం వెనక ఉన్న అర్హతని చెప్పకనే చెప్పేస్తుంది.
తెలుగు హల్లుల్లో క,చ,ట,త,ప వర్గాల్లో రెండవ అక్షరం లిపిలో అంతరించిపోయినా ఇంకా నుడికారంలో కొనసాగుతోంది. ఆ అక్షరాలు ఉదాహరణకి కాలిఫోర్నియా, గాబీ, గారీ(గ్యారీ అని వ్రాస్తున్నాం ప్రస్తుతం) , జాన్, మంజాన , జూ ఇలాంటి పదాలు పలకటానికి ఉపకరించేవి. సరళం గా చెప్పాలంటే జాన్ కి అమెజాన్ పదాలు పలికినప్పుడు ఉండే తేడా. ఈ తేడా గమనించి పాడటం తెలుగు పట్ల గౌరవం పాటించిన గాయనీ గాయకులకు అభివందనం.
మస్తానీ:
మస్తానీ పాడే ప్రేమగీతంగా వచ్చే ఈ పాటకు శ్రేయాఘోషల్ గానం అద్భుతం.
సాకీలో దివినించి జారె జర జరా/కలికి అప్సర కలల తెమ్మెర /పగడాల సొగసుల దొంతర అంటూ నచ్చిన కళ్ళలో విచ్చిన కెందామర అని వ్రాయటం చాలా బాగుంది. మరువాల పవనంలా పరువాల దవనంలా తోపాటు కెందామర లాంటి పదం వాడిన రచయితను మెచ్చుకోవచ్చు.
పాటంతా నిజాయితీగా ఉండే సింపుల్ ఎక్స్ప్రెషన్సే అదే ఈపాటలో అందం
బహుమానమై నీదానిగా తరించా ప్రేమలో/వద్దన్నా ప్రపంచం, జన్మం నీకు సొంతం
అదో వెర్రి ప్రేమై నిన్నే చేరుకున్నా/కళ నీవే కాంతి నీవే మస్తానీ శ్వాసలో
ప్రియం తీయనైన అపాయం, నేలంతా గెలిచాననిపించే కేరింతయ్యావే ఇవి కూడా బాగున్నాయి.
ఎదలో నిన్నే లిఖించా:
ఎదలో నిన్నే లిఖించా గీతార్ధసూక్తిగా/విధిగా నిత్యంపఠించా ఖురాను పంక్తిగా
ఉసురాడు ఈద్ ఉత్సవమై ప్రాణాలు నిలిపినావే
రుధిరాన శాసనంలా ఎన్నటికీ జత నువ్వే
అద్భుతం, పాత్రల్లోంచి పుట్టే ఎక్స్ప్రెషన్లు ఇవి .. పాటలు పాత్రలని ప్రతిబింబించటం కథకు దగ్గరగా ఉండటం మంచి పరిణామం
ఏడాది పొడవు చైత్రం ఈ ప్రేమ చిత్రమే/ప్రేమన్న చిన్న ఈ మాటకు లేదు కాలమే/నిండార తనలొ ఒదిగున్నది విశ్వగోళమే super.
మహాలింగా:
ఇది ఊపున్నపాట, ప్రతి పదం పాటలో ఎనర్జీ నింపింది. రామజోగయ్య పాటల రచనా చాతుర్యానికి ఈపాటలోని పదప్రయోగాలు మచ్చుతునక. ఎక్కడా ఇది డబ్బింగ్ పాట అని అసలు అనిపించదు.
Singers: Divya Kumar, Mani Iyer, Arun Ingle, Kaustubh Datar అంతా తెలుగువాళ్ళేనేమో అనిపించింది.
మనమింతే ఉడుకు సరుకు/కత్తివేటు కరుకు చురుకు
మోగించు ధిన్నకు ధిన్నకు మహలింగా
ఎదలు చెదిరి బెదురుకుని/తగని పొగరు వదులుకుని
ముడిచింది వైరిగణం ఉన్న తోక
మీరా చిత్తచోరా: Singers: Shreya Ghoshal, Pt. Birju Maharaj
ఇంకో చక్కని మెలోడీ , ఈ పాట ఒక కీర్తనలా ఉంది. అన్నీ చక్కగా కుదిరాయి.
పాటల పోటీల్లో రాబోయే రోజుల్లో వినే అవకాశాలున్నపాట అనిపిస్తోంది.
ఈపాటలో అన్నీ perfect.
జయభేరీ విజయగీతిక:
ఒక వీరునికి స్వాగతం పలికే గీతంలా అనిపించే ఈపాట తెలుగులో అద్భుతంగా కుదిరింది, హిందీ కంటే కూడా అనిపించింది. గగనమే కీర్తిపతాక , ప్రియస్వాగతం లాంటి ఎక్స్ప్రెషన్లు చాలా బాగున్నాయి
జయభేరీ విజయగీతిక ప్రియస్వాగతమన్నది వేడుక
గంధముపూసి మాలలువేసి స్వాగతమన్నది వేడుక
నిత్యవిజేతకు భాగ్యవిధాతకు/గగనమే కీర్తిపతాక/సాటిపోటి లేనేలేరు ఎందాక ||జయభేరీ విజయగీతిక||
Singers: Payal Dev, Shashi Suman, Kunal Pandit, Prithvi Gandharv, Rashi Rraga, Geetikka Manjrekar, Kanika Joshi - did excellent job.
మహాలింగాతో పాటూ ఈపాటకూడా హిందీకన్నా తెలుగులో ఇంకా బాగుంది. This song has life all over it.
బంగారిపోరి: Singers: Shreya Ghoshal, Neeti Mohan, Mayuri Patwardhan, Archana Gore, Pragati Joshi
చిర మాంగల్య భోగ భాగ్యాల గౌరి కరుణించు సంబరంగా /
నీ ప్రాణమైనాడు నా ఐనవాడు/మన ఇద్దరి పాపిట కుంకుమ చెరిసగమే
పాట సన్నివేశానికి అతికినట్టు సరిపోయే సాహిత్యం.
శ్రేయాఘోషల్ చాలా బాగా పాడిన ఈపాటలో,ఆమె కొన్ని టిపికల్ తెలుగుపదాల(జాబిలి , జావళి) ఉచ్చారణ బాగుంది
తెలుగు హల్లుల్లో క,చ,ట,త,ప వర్గాల్లో రెండవ అక్షరం లిపిలో అంతరించిపోయినా ఇంకా నుడికారంలో కొనసాగుతోంది. ఆ అక్షరాలు ఉదాహరణకి కాలిఫోర్నియా, గాబీ, గారీ(గ్యారీ అని వ్రాస్తున్నాం ప్రస్తుతం) , జాన్, మంజాన , జూ ఇలాంటి పదాలు పలకటానికి ఉపకరించేవి. సరళం గా చెప్పాలంటే జాన్ కి అమెజాన్ పదాలు పలికినప్పుడు ఉండే తేడా. ఈ తేడా గమనించి పాడటం తెలుగు పట్ల గౌరవం పాటించిన గాయనీ గాయకులకు అభివందనం.
నాతో ముఖాముఖి: ఈపాటలో ఉపయోగించిన సాంత్వనం , ఉగాది, నిశీధి లాంటి పదాలు హైలైట్, ఒక డబ్బింగ్ పాటకి ఇలాంటి పదాలు వాదటాన్ని తెలుగువాడిగా సంతోషం కలిగింది. ఒక తెలుగువాడు మాత్రమే వ్రాయగలిగే ఎక్స్ప్రెషన్స్ , మరోసారి రామజోగయ్య సత్తా చాటారు.
నిన్నటి నిశీధికి ఉదయమాయెను సాంత్వన
చిగురయే ఉగాదిగా వెలిగెనే నిరీక్షణ
ఇసుమంత నీ దయే .వెన్నెలాయెను బ్రతుకున
అపురూపం అతిమధురం/దేవా నీ కరుణ
గజాననా: ఈపాట ట్యూన్ సాయిబాబా హారతి పాట (జయదేవ జయదేవ దత్తా అవధూత) లా ఉంది. కానీ పాటలో మూడ్ ని ఎలివేట్ చేసే మ్యూజిక్. ఒక ఉద్వేగం కలుగుతుంది పాట వినేటప్పుడు. సినిమాలో ఏదో ఒక కీలక సన్నివేశానికి ఉపయోగపడి ఉంటుంది.
సాధారణం గా డబ్బింగ్ పాటలకు ఉండే చిక్కులు
1. మాత్రుకలోని భావాన్ని అనుసృజించటం కాకుండా మక్కీకి మక్కీ దింపాల్సిరావటం
2. వేరే హలంత భాషలోని ట్యూన్ కు తెలుగు సాహిత్యం కిట్టించినట్లు ఉండటం
3. పరభాషా గాయనీగాయకుల ఉచ్చారణా దోషాలవల్ల పాటలో ప్రేక్షకుడు లీనమవ్వలేకపోవటం
ఈమూడు చిక్కులూ ఈపాటల్లో కనపడవు పైగా సగీతం రసమయాత్మకంగా అసలు తెలుగు పాటలే మొదట చేశారేమో అనిపించేలా ఉంటే. గాయనీ గాయకులు ఉచ్చారణపై చాలా శ్రధ్ధ చూపినట్లే కనపడుతుంది. జాబిలి, జావళి లాంటి పదాలలో ' జ ' అక్షరాన్ని పలికిన విధానం లో ఉన్న తేడా గమనించి పలకటం ఒక ఉదాహరణ. ఇలా దాదాపు అందరు గాయనీ గాయకులూ ఉన్న పరిధి మేరకు నిజాయితీగా కృషిచేశారని చెప్పుకోవచ్చు.
ఇలాంటి అరుదైన సినిమాకి సింగిల్ కార్డ్ అవకాశం రావటం రామజోగయ్య గారి అదృష్టం ఐతే.. ఆ పాటలకి ఆయన అందించిన సాహిత్యం ఆ అదృష్టం వెనక ఉన్న అర్హతని చెప్పకనే చెప్పేస్తుంది. Ramajogaiah Sastry Darivemula gaaru Kudos! మీపై గౌరవం మరింత పెరిగింది.

Monday, July 27, 2015

శ్రీమంతుడు ... పర్పస్ ఉన్న పాటలు ( Lyrics - Review)

శ్రీమంతుడు


మహేష్ బాబు సినిమా అంటేనే జనాల్లో అంచనాలు,ఆసక్తిఉంటాయి, మిర్చిలాంటి విభిన్నమైన కథతో బ్లాక్బస్టర్ తీసిన కొరటాల శివ దర్శకత్వం ,తన పాటలతో ఉర్రూతలూగించే దేవీశ్రీప్రసాద్ సంగీతం. ఇవన్నీ ఈసినిమాపై ఆసక్తిని అమాంతం పెంచేశాయి.
ఇటీవలే విడుదలైన ఈ సినిమా పాటలు ఈ అంచనాల్ని నిలబెడుతూ చార్ట్బస్టర్ లు గా నిలిచి ఈ ఆడియోని పెద్ద సక్సెస్ చేశాయి
దేవీశ్రీ ప్రసాద్ సంగీతంలో వరసగా హిట్ పాటలు రాస్తూ దూసుకుపోవటమే కాకుండా,
మహేష్ బాబు నటించిన ఖలేజా సినిమాలో 'సదాశివ సన్యాసి ' పాటకు గీత రచయితగా ఫిల్మ్ ఫేర్ అందుకున్న రామజోగయ్య శాస్త్రి ఈ చలన చిత్రం లోని పాటలన్నిటికీ అద్భుతమైన, సందర్భోచితమైన సాహిత్యాన్ని అందించారు.
పాటలు వింటుంటే ఇటువంటి కథను ఎంచుకున్న దర్శకుడిని ప్రశంసించకుండా ఉండలేం అనిపిస్తుంది. దేవీశ్రీ ప్రశాద్, రామజోగయ్య విజృంభించి చేశారు పాటలని.

పాటలకు తమదైన ఆత్మ ఉంది, సాహిత్యం మనసుని హత్తుకుని ఆత్మను స్పృసిస్తుంది. 

శ్రీమంతుడు ... పర్పస్ ఉన్న పాటలు 

  1. హే రాములోడు వచ్చినాడురో: ఈ ఆల్బంలో మొదటిగా వచ్చే పాట 'రాములోడు వచ్చినాడురో' ఒక వినూత్నమైన ప్రయోగాత్మకమైన పాట.రామాయణంలోని కథను మొత్తాన్ని ఒక్క ఫోక్ పాటలో చెప్పగలగటం అవలీలగా చేసేశారు. ఈ పాటలో రామాయణ సారాన్ని జీవితానికి అన్వయిస్తూనే మధ్యలోనే                                                             "జీవుడల్లే పుట్టినాడురో దాంతస్సదియ్య దేవుడల్లే ఎదిగినాడురో"                                                        "చెడుతలపుకి చావుదెబ్బ తప్పదంటు చెప్పినాడురో"                                                                            "తనకథనే పూసగుచ్చి మనకు నీతి నేర్పినాడురో" అని వ్రాయటంలో రచయిత నేర్పు కనపడుతుంది.
    ఈ పాటలో కోరస్ లో 'మరామరామరామరామా' అని రామాయణంలోని కథను స్పురింపచేసే పదం చక్కగా ఇమిడింది.

2. జతకలిసే: "జగములు రెండు జతకలిసే"  అని మొదలయ్యే రెండవ పాట ,
                 రెగులర్ గా స్లో డ్యూయట్ అనగానే హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ పాట అన్నట్టు కాకుండా ,ఒక స్వఛ్ఛమైన అనుబంధం గురించి, దాని తాలూకు మాధుర్యం గురించి విభిన్నంగా  వివరించిన పాట ఇది. కట్ చేస్తే వచ్చే ప్రేమపాటలా కాకుండా ఒక అనుబంధాన్ని తద్వారా హీరో హీరోయిన్ కారెక్టర్స్ ఎస్టాబ్లిష్ చేయటానికి వాడుకోవటం వల్లే అసలు ఈ పాటలో కొత్తదనం                   వచ్చింది అనిపిస్తుంది.ఈ పాట కు సంగీతం సాహిత్యం అల్లుకుపోయి ఒక మంచి పాట విన్న అనుభూతి కలిగిస్తాయి.

    "ఏ కన్నూ ఎపుడూ చదవని పుస్తకమై వీరు, చదివేస్తున్నారు ఆనందంగా ఒకరిని ఇంకొకరు
      ఈ లైన్ వినగానే ఆకట్టుకుంటుంది, విన్నాక మనసులోనే తిరుగాడుతూ ఉంటుంది.
    ఇలాంటి జంటని ఎవరూ చూసిఉండరు, ఆడ మగ అని బేధం మనసులోని ఇంకా రాని పసివాళ్ళ అంత స్వచ్చంగా ఉన్నారు 
     అని చెప్పటం చాలా బాగుంది. 

    "నలుపు జాడ నలుసైనా అంటుకోని హ్రుదయాలు/తలపులోతున ఆడమగలని గురుతులేని పసివాళ్ళు" అంటూ ఏ కల్మషం 
     లేనీ స్వచ్చమైన Feeling అనే భావాన్ని చిన్న పదాల్లో  చాలా అందం గా చెప్పటం జరిగింది.
      అలానే "బహుశా బ్రహ్మ పొరపాటు ఏమో ఒకరే ఇద్దరు అయ్యారు", "ఇపుడే కలిసి అప్పుడే వీరు ఎపుడో కలిసిన వారయ్యారు
      ఇవి కూడా ముచ్చటగా ఉన్నాయి

3. చారుశీల: మూడో పాటగా "చారుశీల" బీట్ ప్రధానంగా సాగే ప్రేమ పాటగా వస్తుంది. ఇలాంటి పాటల్లో రామజోగయ్య ది 
                  అందెవేసిన చెయ్యి.  
           "నీ స్మైలే లవ్ సింబలా ","కాముడు రాసిన గ్లామర్ డిక్ష్ నరీ" , "వైల్డ్ ఫైర్ పై వెన్నపుస వయసా" ఇవి కొన్ని చమక్కులు.
           ఈపాట మొత్తానికి "నా మునివేళ్ళకు కన్నులు మొలిచెనే నీసిరి సొగసును తాకితే" అన్న ఎక్స్ప్రెషన్ చాలా బాగుంది.

4. శ్రీమంతుడా: "సాయం, సమాజమే నీగేయం నిరంతరం కోరే ప్రపంచ సౌఖ్యం నీకు కాక ఎవరికి సాధ్యం!"

       ఈ సినిమా ఆత్మని ప్రతిబింబిస్తున్నట్టు అనిపిస్తూ ఆత్మని తాకే పాట "శ్రీమంతుడా". ఈ పాటను రామజోగయ్య  ఫిలాసఫీ , 
        ఆశావహదృక్పధం కలగలిపి ఎంతో అద్భుతం గా రాశారు. రాస్తూ కూడా కవి ఎంతో తన్మయత్వం పొంది ఉంటాడనిపిస్తుంది 
        పాటంతా పరుచుకున్న ఉదాత్తమైన భావాలు, ప్రయోగాలు, అలంకారాలు చూస్తే.   
        సరళంగా ఉన్న రుద్రవీణ పాటను తలపిస్తుంది ఈ పాటలోని "మనిషితనం".

             "లోకం చీకట్లు చీల్చే ధ్యేయం నీ ఇంధనం ప్రేమై వర్షించనీ నీ ప్రాణం"
            "రుణము తీర్చే తరుణమిది  కిరణమై పదపదరా" లాంటి భావాలు పాటంతా కనిపిస్తాయి 
             విశ్వమంతటికీ పేరుపేరునా ప్రేమ పంచగల పసితనమా
            లేనిదేదో పనిలేనిదేదో విడమరచి చూడగల ఋషి గుణమా
             లాంటి భావాలు, భావ వ్యక్తీకరణ అత్యద్భుతంగా ఉన్నాయి.

           పాట విన్నాక మనసు మనతో పిలుపు వినరా అనకమానదు
            మనసు వెతికే మార్గమిదిరా మంచికై పదపదరా! పిలుపు వినరా!

5. జాగో జాగో: ఇది కథానాయకుడి కారెక్టరైజేషన్ వ్యక్తపరుస్తూ వచ్చే ఫాస్ట్ బీట్ పాట. ఇందులో కూడా శ్రీమంతుడి ఉదాత్తమైన 
                    భావాలు బీట్ లో చక్కగా ఒదిగిపోయాయి.
            "వేల వేల వేల సైన్యం అయ్యి ఇవాళ దూసుకెళ్ళమంది నాలో కల" , నట్టనడి పొద్దు సూరీడులా నవ్వటం
             సంతోషాల జెండా ఎగరేశా లాంటి భావలు బాగున్నై.

          "వెతికా నన్ను నేను దొరికా నాకు నేను, నాలో నేను ఎన్నోవేల వేళ్ళ మైళ్ళు తిరిగి
           పంచేస్తాను నన్ను పరిచేస్తాను నన్ను ఎనిమిది దిక్కులన్నీ పొంగిపోయే ప్రేమై వెలిగి"

         "స్వార్ధంలేని చెట్టు బదులేకోరనంటూ పూలుపళ్ళూ నీకూ నాకూ ఎన్నో పంచుతుందే
          ఏమీపట్టనట్టు బంధం తెంచుకుంటూ మనిషే సాటిమనిషిని చూడకుంటే అర్థం లేదే"
        "విలా విలా అల్లాడిందే ప్రాణం  చేతైన మంచే చెయ్యకుంటే,ఇవ్వాలనిపించదా ఇస్తూ ఉంటే .. జాగో జాగో  "
        లాంటి భావాలతో పాటంతా గొప్పగా ఉంది.

         ఇతరులకి సాయపడటం , చేతనైనంతలో మంచి చేయటం అనే mission ఉన్నకథా నాయకుడు పాడే మనిషితనం 
         నిండిన పాట.అటు సినిమాలో ఇమిడి , కథను ముందుకు నడుపుతూనే, సినిమాకు సంబంధం లేకుండా చూస్తే 
          సాహిత్యం గా కూడా నిలబడే పాటలు రాయటంలో కవి సఫలం అయ్యారనిపిస్తాయి ఈ పాటలు.

6. దిమ్మతిరిగే: రెగులర్ మాస్ పాట దిమ్మతిరిగే పాట. లిరిక్స్ ట్యూన్ కి తగ్గట్టుగా ఉన్నాయి.
                   దిమ్మతిరిగే దిమ్మతిరిగే "కమ్మ కమ్మగా దిమ్మ తిరిగే" అనటం కొత్తగా ఉంది. అలానే
                   పులిగోరు , చేపకూర అంటూ నేటివిటీ కి తగ్గట్టు ఉంటూ
                  "నువ్వే కాని కలకండైతే నేనో చిట్టి చీమై పుడతా!" లాంటి చిలిపి ఎక్స్ప్రెషన్స్ తో మంచి ఊపు ఉన్న పాట ఇది

కథకు దగ్గరగా ఉన్న పాటలు తెలుగులో రావటం తక్కువే.కథలో మిళితమై కథను ముందుకు నడిపే పాటల్లా అనిపిస్తాయి శ్రీమంతుడు సినిమాలోని పాటలు.
సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్, సాహిత్యం అందించిన రామజోగయ్య శాస్త్రి , దర్శకులు కొరటాల శివల టీం వర్క్ కనిపిస్తుంది
మొత్తంగా ఈ శ్రీమంతుడు ఆల్బం వింటే మంచి పాటలు విన్న సంతృప్తి కలుగుతుంది, సినిమా పై ఆసక్తి పెరుగుతుంది.
మనసుపొరల్లో ఎక్కడో ఉన్న మనిషితనం అనే విత్తనం చిగురువేస్తుంది.

Monday, February 28, 2011

నేను చేయగలిగింది ఒక్కటే!




ఆకాశాన్ని వంచి.. జాబిలిని దించి.. దానికి గోల్డెన్ ఫేషియల్ చేయించి
నీ నుదుట బొట్టులా పెట్టాలి
ఒక మెరుపుని పట్టుకుని ...కొన్ని చుక్కల్ని ఏరుకొచ్చి...
వాటిని కలిపి నీ పాదాలకు పట్టీలా కట్టాలి

నేను…..
నేను….. నిజానికి ఆకాశాన్ని వంచలేను... జాబిలిని దించలేను..చుక్కల్ని తెంచలేను ..
నేను చేయగలిగింది ఒక్కటే!
అవసరమైతే నాకోసం వీడు ఏదైనా చేసెయ్యగలడు అనేంత నమ్మకం ఇవ్వటం
--శ్రీనివాసమౌళి

Thursday, February 11, 2010

ఆశ నిరాశలు శ్వాసగ అడిగా!

కిరణ్ అన్నయ్య ఇండియా వచ్చినప్పుడు... నేను... కిరణ్(అప్ కమింగ్ పాటల రచయిత).. అవినాష్(వినాయకుడు సినిమా పాటల రచయిత)
కలవటం జరిగింది... ముగ్గురం సినిమాల గురించి...సినిమా పాటల గురించి చర్చించుకుంటుండగా ... మాటల్లో నేను చిన్నగా ఉన్నప్పుడు పెద్దగా హిట్ కాని పాట ఒకటి కిరణ్ వినిపించాడు..వేటూరి గారి రచన అది... దానికి వైరముత్తు గారు తమిళ్ లో పాట వ్రాశారు..ప్రతి లైన్ ...అడిగా! అని పూర్తవుతూ భలే బాగుందనిపించింది పాట...అప్పట్లో నేను బెంగళూరు లో పనిచేసేవాడిని... ఆరోజు తిరుగు ప్రయాణమయ్యా...వోల్వో బస్సులో..ఏమీ తోచని టైం లో ఏవో లైన్స్ గుర్తు వస్తున్నాయి.. సెల్ తీసి రాసేశా... చివరికి మూడు నిమిషాల్లో వ్రాసిన SMS కవిత అయ్యింది.
కొంతమంది స్నేహితులు(ప్రియనేస్తం చంద్రశేఖర్) ఇది నచ్చి కొత్తబంగారులోకం అనేపేరుతో డెస్క్ వద్ద అతికించుకోవటం... గొప్ప అనుభూతిని మిగిల్చింది..ప్రేరణ కిరణ్ అన్నయ్యో! వేటూరి గారో! ముంబై ఉగ్రవాదుల దాడిలో బలైన జవాన్లో ...ఏమో ఎవరో తెలియదు..
నాకు ఈ కవిత చాలా ఇష్టం ....


ఆశ నిరాశలు శ్వాసగ అడిగా!
అనుబంధాలకు అర్ధం అడిగా!
పెనుగండాలను ప్రేరణ అడిగా!
ప్రగతి పధానికి అడుగులనడిగా!
జగతి రధానికి సారధినడిగా!
సత్యం కోరే సంఘం అడిగా!
నిత్యం నిలిచే ప్రేమను అడిగా!
నేనంటే? అని ఈ క్షణాన్ని అడిగా!
మదిని మలచు నిశ్శబ్దం అడిగా!
కసిని పిలుచు కష్టాన్నే అడిగా!
కాలం కలిపే బంధం అడిగా!
మనిషిగ నిలిపే మరణం అడిగా!
తనువు కరిగితే తలపుగ మిగలగ ....
చరిత హృదిని మరుజననం అడిగా!
-- శ్రీనివాసమౌళి

Monday, June 22, 2009

బుడుగు ...బుల్లి అల్లుడి ఖద :)

ఈ మధ్య మా family family కి promotions వచ్చాయ్ :)
మా అక్కకి బాబు పుట్టాడు... చూడటానికి వెళ్ళినప్పుడు వచ్చిన ఆలోచనతో ఒక 'చిన్న బుడుగు' లాంటి కధ రాశా...
నిజానికి బుడుగు లాంటి character ని అనుకరించటం ఒకింత సాహసమే అని తెలుసు...
hope you like it....

బుడుగు

నా పేరు జూనియర్ బుడుగు...నేను పుట్టి రేపటికి మొన్న....
మా అమ్మ పేరు సుష్మ...నాన్న పేరు నాన్న...
మా మామయ్య పేరు మౌళి...మామామయ్యకి సిగ్గెక్కువ ఎవళ్లతోను మాట్టాడడు...
అమ్మాయిలతొనే పోట్టాడుతాడు..వాడు పాటలు రాస్తాడు...
పాటలంటే మాటలే కాని వాటిలిని పాడుతారు
వాడి దగ్గర ఇలాంటివి చాలా ఉన్నై... softwareలు...కొత్త పాటలు...సుత్తి పాటలు ..నత్తి పాటలు(త్యూనులు అంటారులే)
(నేను ఎప్పుడూ ఉంగా ఉంగా అని ఏడ్చినట్టు...పాటంతా త న నా...త న నా అనే పాడుతారు....)
నాకు కూడా పాడటం వచ్చు కాని త న నా అవి రావు...పాడాలనిపిస్తే...పాడినట్టు ఏడుస్తా...కళ్ళుమూచుకుని...

నాకు నవ్వటం కుంచెం వచ్చు...మాట్టాడటం అస్సలు రాదు... యాడవటమే బాగా వచ్చు
అందరూ నేను బాగా ఏడుస్తా అని మెచ్చుకుని ముద్దులు పెట్టుకుంటారు....నాకు అది నచ్చదు...ఏడవటం కాదు వాళ్ళు నన్ను ముద్దులు పెట్టుకోటం
అందుకే ఇంకా గాఠిగా ఏడ్చేస్తాను... అప్పుడు ఇంకా గఠిగా ముద్దులు పెట్టేస్కుని...జో జో బజ్జో...ఒళళళళళా హాయమ్మా ..హాయివారబ్బాయి ఆపదలుగాయి ...చిన్ని తండ్రినిగాయి సీవెంకటేశా!...అని పాడి బెదిరించుతారు
అందుకే మనం ఇలాంటి పాట మొదలవ్వగానే యాడవటం ఆపి నవ్వాలి లేదంటే వాళ్ళు ఆపరు...

నేను ఎందుకు ఏడుస్తానో నాకు తెలీదు....మా అమ్మకి కూడా తెలీదు... మహా మహా మా అమ్మమ్మకి కూడా తెలీదు..
నిజ్జానికి డాక్టరుకి కూడా నేను ఎందుకు ఏడుస్తానో తెలీదు.. కాని ఎవరికి ఏమీ తెలీదని ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది
అసలు పెద్దవాళ్ళకి ఏమీ తెలియదు...నేను ఉచ్చపోచ్చుకొని ఏడిస్తే... పాల పీక తెచ్చి నోట్లో పెట్టేస్తారు...
వద్దన్నా కాని తాగు తాగమ్మ...చీ చీ...పోచ్చి అంటారు..పోనీలే అని మనం కుంచెం తాగటానికి ట్రయ్ చేస్తామా... మొత్తం తాగెయ్యమంటారు..
పాలు వేస్టు అయిపోతయ్ అంటారు... నేనేమైనా పాలు కావాలి అని ఏడ్చానా...పాలు వద్దని ఏడిచానా...ఉచ్చపోచ్చుకుని లంగోటి తడిసిపోయిందని ఏడిచాను..
పాలు పట్టేసినాక నా లంగోటి చెక్ చేసి...అరే వీడు ఇప్పుడే పాలు తాగి అప్పుడే పోసేశాడే అని నవ్వుతారు...
అప్పుడు నాకు నవ్వు వస్తుంది...కాని నేను నవ్వను ఎందుకంటే నాకు నవ్వటం బాఘా రాదు

నాకు యాడవటం బాగా వచ్చు... అమ్మకి బయంపడటం అమ్మమ్మకి జోల పాడటం వచ్చు...
డాక్టరుకి కవర్ చెయ్యటం వచ్చు... మెడికల్ షాపు వాడికి బిల్లు వెయ్యటం వచ్చు...నర్సుకి ఇంజెక్షను చెయ్యటం వచ్చు....
అందుకే నర్సు వచ్చినప్పుడు మనం యాడవకూడదు.. ఎత్తుకుంటే మాత్రం గాఠిగా ఏడ్చెయ్యాలి...

నాకు పాలు పట్టుతారు...అది నాకు నచ్చకపోతే నేను గుక్కపట్టుతాను...నిజ్జం ఏడుపులా నటించుతాను
అప్పుడు అమ్మ భయపడి...అమ్మా! అమ్మా! :( అని అమ్మమ్మని పిలుచుకుంటుంది.....
నేను ఇలా అమ్మకి కుంచెం భయం పెట్టుతాను,,, లేదంటే పెద్దవాళ్ళు మనమీద అజమాయిషీ చేసేస్తారు,,,
చిన్నపిల్లల కింద లోకువ కట్టేసి పాలు పట్టేస్తారు
మా అమ్మ అప్పుడెప్పుడో పుట్టింది..అయినా నేను మా అమ్మకి నిన్నటి వరకు తెలీదు,,,,
నాకైతే పుట్టినప్పటినుంచి మా అమ్మ తెల్సు...

నాకు AC అన్నా లంగోటి అన్నా... చాలా ఇష్టం రెండూ చల్లగా ఉంటయ్....
ఇంకా మా మామయ్య కొనుక్కొచ్చిన జుబ్బా వేచుకుని కళ్ళూ మూచుకుని దోమతెర అంబ్రిల్లా లో పడుకోటం ఇంకా ఇష్టం

మా నాన్నకి సెలవలు లేవంట...మా మామయ్యకి తాతయ్యకి(నాన్న తాతకి...అమ్మ తాతకి) కూడా లేవంట...
నా దగ్గర మాత్రం ఉన్నయ్యా ఏంటి నాకు అసలు సెలవంటే ఏంటో కూడా తెలీదు ఇంక నా దగ్గర ఎలా ఉంటయ్
నా దగ్గర ఉంటే కుంచెం ఇచ్చేవాడినే ఎందుకంటే నేను మంచివాడిని...ఛాలా మంచి వాడిని...పండు వాడిని..

నాకు అమ్మ పోలికా?..నాన్న పోలికా?... ఎవరిపోలిక అని అంటూ ఉంటారు కాని నాకు అస్సలు మా తాత పోలిక
నిన్నే ఈ విషయం కనిపెట్టా ఎందుకంటే మా తాతకి కూడా నా లాగే పళ్ళు లేవ్

--శ్రీనివాసమౌళి

చెప్పటం మర్చిపోయా! నాకు "హి" అనే అక్షరంతో పేరు పెట్టాలి... మీకు ఏమైనా పేర్లు అనిపిస్తే బుడుగుకి పేరు అని సబ్జెక్టు పెట్టి మా మామయ్యకి నాలుగో ఫదో పేర్లు కామెంట్లో చెప్పండి

Saturday, January 12, 2008

జ్ఞానోదయం..



దోమలు చెవిలోనే ఎందుకు అరుస్తాయో తెలుసా??

ఎందుకబ్బా....ఎందుకబ్బా.....ఎందుకు...ఎందుకు...ఎందుకు....
ఎందుకు చెప్మా....
జ్ఞానోదయం..జ్ఞానోదయం..

అవి చెవి దగ్గరకి వచ్చి ఎమీ అరవవు..... చెవికి దగ్గరగా వచ్చినప్పుడు మనకి వాటి అరుపు వినపడుతుంది అంతే!..

ఇట్లు,
నేను.